హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు బ్రేకులు.. కారణం ఇదే!

హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్లను పరీక్షించకపోవడంతో.. గురు, శుక్రవారాల్లో శాంపిళ్లను సేకరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆశించిన రీతిలో టెస్టులు జరగడం లేదు. శాంపిళ్లను సేకరించినా.. టెస్టులకు సమయం పడుతుండటంతో శాంపిళ్ల సేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది.

కరోనా టెస్టులు పెంచాలని కేసీఆర్ సర్కారును హైకోర్ట్ ఆదేశించింది. దీంతో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 16 వరకు రాష్ట్రంలో 44,341 టెస్టులు చేయగా.. 5406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 24 నాటికి 67,318 టెస్టులు చేయగా.. 10,444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కేసులు పెరుగుతుండటంతో ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టుల చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2200 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ, ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ బుధవారం గరిష్టంగా 4,069 కరోనా టెస్టులు చేశారు. టెస్టులు ఆశించిన వేగంగా జరగకపోవడంతో.. పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోయింది. రోజుకు ఐదు వేల కరోనా టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న కోబాస్ 8800 మెషిన్‌ను సీఎస్‌ఆర్ కింద తెలంగాణ కోసం ఆర్డర్ చేయగా.. దాన్ని కోల్‌కతాకు తరలించాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో టెస్టులు చేయలేకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *